మార్కు 10:1-12
మార్కు 10:1-12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు కపెర్నహూము నుండి యూదయ ప్రాంతానికి మరియు యోర్దాను నది అవతల ఉన్న ప్రాంతానికి వెళ్లారు. మళ్ళీ ప్రజల గుంపు ఆయన దగ్గరకు వచ్చింది కనుక ఆయన ఎప్పటిలాగే వారికి బోధించారు. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. వారు, “విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెను పంపించడానికి మోషే పురుషునికి అనుమతించాడు” అన్నారు. అందుకు యేసు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోషే ఈ ఆజ్ఞను మీ కొరకు వ్రాసాడు. సృష్టి ఆరంభం నుండే దేవుడు వారిని ‘పురుషునిగా స్త్రీగా’ సృజించారు. ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, అలా వారిద్దరు ఏకశరీరంగా అవుతారు.’ కనుక వారు ఇక ఇద్దరు కారు, కాని ఒకే శరీరమే అవుతారు. కనుక దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు. వారందరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, శిష్యులు వీటి గురించి యేసుని వివరంగా చెప్పమని అడిగారు. ఆయన ఇలా జవాబిచ్చారు, “తన భార్యను విడిచి మరొక స్త్రీని వివాహం చేసుకొనేవాడు ఆమెకు విరుద్ధంగా వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని వివాహం చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది.”
మార్కు 10:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తరువాత యొర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు. యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు. యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు. అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.
మార్కు 10:1-12 పవిత్ర బైబిల్ (TERV)
యేసు ఆ ప్రాంతాన్ని వదిలి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుండి యొర్దాను నది అవతల వైపునున్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజల గుంపులు ఆయన దగ్గరకు వచ్చాయి. యేసు ఎప్పటిలాగే వాళ్ళకు బోధించాడు. కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని అనుకొని వచ్చి, “ఒక మనిషి తన భార్యకు విడాకులివ్వటం న్యాయ సమ్మతమేనా?” అని అడిగారు. యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. వాళ్ళు, “విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపివేయటానికి మోషే అనుమతి ఇచ్చాడు” అని అన్నారు. యేసు, “మీరు దేవునికి లోబడనివారు కనుక మోషే అలా వ్రాశాడు. కాని, దేవుడు తన సృష్టి ప్రారంభించినప్పుడు ‘ఆడ మగ అనే జాతుల్ని సృష్టించాడు’ అందువల్లే, పురుషుడు తన తల్లి తండ్రుల్ని వదిలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు యిద్దరివలే కాకుండా ఒకరిలా జీవిస్తారు. కనుక దేవుడు ఐక్యం చేసిన వాళ్ళను ఏ మానవుడూ వేరు చేయకూడదు” అని అన్నాడు. అంతా యింట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. యేసు ఇలాగన్నాడు: “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించినవాడౌతాడు. అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.”
మార్కు 10:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి: ఆయన తనవాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై–పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి. అందుకాయన–మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను. వారు–పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా యేసు–మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. అందుకాయన–తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.