మీకా 7

7
1వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్లగెల యొకటియు లేకపోయెను, నా ప్రాణమునకిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను. 2భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును. 3రెండు చేతులతోను కీడుచేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగునవారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు. 4వారిలో మంచివారు ముండ్లచెట్టువంటివారు, వారిలో యథార్థవంతులు ముండ్లకంచెకంటెను ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. 5స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. 6కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.
7అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును. 8నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. 9నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. 10నా శత్రువు దాని చూచును. –నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. 11నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. 12ఆ దినమందు అష్షూరుదేశమునుండియు, ఐగుప్తుదేశపు పట్టణములనుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసునదివరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆయా సముద్రములమధ్యదేశములనుండియు, ఆయా పర్వతములమధ్యదేశములనుండియు జనులు నీ యొద్దకు వత్తురు. 13అయితే దేశనివాసులు చేసిన క్రియలనుబట్టి దేశము పాడగును.
14నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపువారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. 15ఐగుప్తుదేశములోనుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును. 16అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంత కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును. 17సర్పములాగున వారు మన్ను నాకుదురు, భూమిమీద ప్రాకుపురుగులవలె తమ యిరవులలోనుండి వణకుచు ప్రాకి వత్తురు, మన దేవుడైన యెహోవాయొద్దకు భయపడుచు వత్తురు, నిన్నుబట్టి భయము నొందుదురు. 18తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. 19ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. 20పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్ర హింతువు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మీకా 7: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for మీకా 7