తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపెట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి –కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు–ఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి–మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి–నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి–నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి–మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనముచేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక–కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను. అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చి–పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు–పెండ్లికుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటివారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపర చును చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.
Read మత్తయి 9
వినండి మత్తయి 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 9:1-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు