మత్తయి 9:1-17

మత్తయి 9:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపెట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి –కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు–ఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి–మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి–నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి–నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి–మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనముచేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక–కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను. అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చి–పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు–పెండ్లికుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటివారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపర చును చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.

షేర్ చేయి
Read మత్తయి 9

మత్తయి 9:1-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకొన్నారు. కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “కుమారుడా, ధైర్యం తెచ్చుకో, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు. అప్పుడు కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని చెప్పుకొన్నారు. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో, “మీ హృదయాల్లో ఈ దురాలోచనలు ఎందుకు రానిస్తున్నారు? వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేక ‘లేచి నడువు’ అని చెప్పడమా? అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు, అతడు లేచి ఇంటికి వెళ్లాడు. జనసమూహం అది చూసి, వారు భయంతో నిండుకొని, మానవునికి ఇలాంటి అధికారాన్ని ఇచ్చిన దేవుని స్తుతించారు. యేసు అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒక వ్యక్తిని చూసి, “నన్ను వెంబడించు” అని అతనితో అన్నారు. మత్తయి లేచి ఆయనను వెంబడించాడు. యేసు మత్తయి ఇంట్లో భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో పాటు కలిసి భోజనం చేశారు. ఇది చూసిన పరిసయ్యులు, “మీ బోధకుడు పన్ను వసూలు చేసేవారితో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు. అది విని యేసు, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. అందుకే మీరు వెళ్లి, ‘నేను కనికరాన్నే కోరుతున్నాను కాని, బలిని కాదు’ అంటే అర్థమేమిటో తెలుసుకోండి: ఎందుకంటే నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు. అప్పుడు యోహాను శిష్యులు వచ్చి, “మేము, పరిసయ్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నాం, కాని నీ శిష్యులు ఉపవాసం ఉండడం లేదు ఎందుకు?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “పెండ్లికుమారుడు తమతో ఉన్నప్పుడు అతని అతిథులు ఎందుకు దుఃఖిస్తారు? పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు” అని జవాబిచ్చారు. “ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, ఎందుకంటే ఆ బట్ట, పాత బట్ట నుండి విడిపోయి చినుగును మరి ఎక్కువ చేస్తుంది. అలాగే ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు; అలా చేస్తే క్రొత్త ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. కనుక క్రొత్త ద్రాక్షరసాన్ని క్రొత్త తిత్తులలోనే పోయాలి అప్పుడు ఆ రెండు భద్రంగా ఉంటాయి” అని చెప్పారు.

షేర్ చేయి
Read మత్తయి 9

మత్తయి 9:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు. కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది, అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు. ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు. యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు? ‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా? అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు. యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు. యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు. పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు. యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు?” అని ఆయనను అడిగారు. యేసు వారికిలా జవాబిచ్చాడు. “పెళ్ళికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి వారు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు. “ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది. ఆ చినుగు మరింత పెద్దదవుతుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.”

షేర్ చేయి
Read మత్తయి 9

మత్తయి 9:1-17 పవిత్ర బైబిల్ (TERV)

యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు. ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు. వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా? పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు. పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు. ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు. యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు. యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’ అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు. ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు. యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు. “పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది. అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు.

షేర్ చేయి
Read మత్తయి 9