మత్తయి 26:47-75

మత్తయి 26:47-75 TELUBSI

ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధానయాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి–బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయి–దీని అంత మేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను. ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి –వీడు దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి. ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్య మేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచు చున్నదని అడిగెను. అందుకు వారు–వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అరచేతులతో కొట్టి – క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి. పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతోకూడ ఉంటివి గదా అనెను. అందుకతడు– నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టుపెట్టుకొని–నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి–నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు– ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక–కోడి కూయకమునుపు నీవు నన్నెరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.