మత్తయి 21:1-22

మత్తయి 21:1-22 TELUBSI

తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల–అవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా –ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగునపరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగునపరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు–ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము–ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి– నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, –దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి –వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు– వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బసచేసెను. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను. శిష్యులదిచూచి ఆశ్చర్యపడి–అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.