మత్తయి 16:1-12

మత్తయి 16:1-12 TELUBSI

అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను –సాయంకాలమున మీరు–ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున– ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనానుగూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు–చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది యెరిగి–అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను. అప్పుడురొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.