మత్తయి 14

14
1ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని 2–ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచియున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. 3-4ఏలయనగా–నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను. 5అతడు ఇతని చంప గోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను. 6అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను 7గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. 8అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై–బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. 9రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతోకూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి 10బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. 11వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను. 12అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి.
13యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. 14ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. 15సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయ మని చెప్పిరి. 16యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా 17-18వారు– ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి 19పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి#14:19 లేక, స్తోత్రము చేసి. ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. 20వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి 21స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.
22వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. 23ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. 24అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్టబడుచుండెను. 25రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను 26ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. 27వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా 28పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని 30గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. 31వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. 32-33వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.
34వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. 35అక్కడి జనులు ఆయనను గుర్తుపెట్టి, చుట్టుపెట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి 36–వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మత్తయి 14: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

మత్తయి 14 కోసం వీడియోలు