లూకా 7:1-10

లూకా 7:1-10 TELUBSI

ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా విని పించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను. శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి–నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితోకూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి–మీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహమువైపు తిరిగి–ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను. పంపబడినవారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి.