లూకా 4:20-27

లూకా 4:20-27 TELUBSI

ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి–ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి–వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన–ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.