లూకా 4:21-27

లూకా 4:20-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి–ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి–వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన–ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

షేర్ చేయి
Read లూకా 4

లూకా 4:21-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అప్పుడు ఆయన వారితో, “ఈ రోజు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నారు. అందరు ఆయనను మెచ్చుకొంటూ ఆయన నోటి నుండి వచ్చే దయ గల మాటలకు ఆశ్చర్యపడి, “ఈయన యోసేపు కుమారుడు కాడా?” అని వారు అడిగారు. యేసు వారితో మాట్లాడుతూ, “ ‘ఓ వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరుచుకో!’ అనే సామెతను తప్పకుండా నాకు చెప్తారు, ఇంకా నాతో, ‘నీవు కపెర్నహూములో కార్యాలను చేసావని మేము విన్నట్లుగా, నీ సొంత గ్రామమైన ఇక్కడ కూడా చేయి’ అని మీరు అంటారు” అని అన్నారు. ఆయన వారితో ఇంకా మాట్లాడుతూ, “ఏ ప్రవక్త తన స్వగ్రామంలో అంగీకరించబడరని నేను మీతో నిజంగా చెప్తున్నాను. ఏలీయా ప్రవక్త రోజుల్లో మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి, దేశమంతట తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులలో అనేకమంది విధవరాండ్రు ఉన్నారని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే వారెవరి దగ్గరకు ఏలీయా పంపబడలేదు, సీదోను ప్రాంతంలోని సారెపతు గ్రామంలోని ఒక విధవరాలి దగ్గరికే పంపబడ్డాడు. మరియు ఎలీషా అనే ఇంకొక ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయులలో అనేక కుష్ఠురోగులు ఉన్నా, సిరియా దేశపు నయమాను తప్ప మరి ఎవరు శుద్ధి పొందలేదు” అని చెప్పారు.

షేర్ చేయి
Read లూకా 4

లూకా 4:21-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు. అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కొడుకు గదా?” అని చెప్పుకున్నారు. ఆయన వారితో, “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు” అన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు. ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా, దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరకీ పంపలేదు. సీదోను ప్రాంతంలో సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక వితంతువు దగ్గరకే పంపాడు. ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్టురోగులున్నా, సిరియా వాడైన నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు.”

షేర్ చేయి
Read లూకా 4

లూకా 4:21-27 పవిత్ర బైబిల్ (TERV)

ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు. అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు. “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు. “ప్రవక్త ఎలీషా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”

షేర్ చేయి
Read లూకా 4