లేవీయకాండము 9:7-24

లేవీయకాండము 9:7-24 TELUBSI

మరియు మోషే అహరోనుతో ఇట్లనెను–నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థబలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలిపీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను. మరియు వారు దహన బలిపశువుయొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠముమీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠముమీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను. అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను. అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలోనుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠముమీద తీసినదానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలిరూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టుదానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజముమీది వపను అప్పగించిరి. బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. యెహోవా సన్నిధినుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీదనున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి.