లేవీయకాండము 21

21
1మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. 2యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము–మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్తసంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, 3తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును. 4అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసికొనరాదు. 5వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు. 6వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావునవారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావునవారు పరిశుద్ధులై యుండవలెను. 7వారు జారస్త్రీనేగాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లిచేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. 8అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావ లెను. 9మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచుకొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.
10ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు; 11అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననేగాని తన తల్లి శవమువలననేగాని తన్ను అపవిత్రపరచుకొన రాదు. 12దేవుని అభిషేకతైలము అనునడు కిరీటముగా అతనిమీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచ రాదు; నేను యెహోవాను 13అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను. 14విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొనవలెను. 15యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.
16మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 17–నీవు అహరోనుతో ఇట్లనుము–నీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. 18ఏలయనగా ఎవనియందు కళంకముండునోవాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడేగాని 19కాలైనను చేయైనను విరిగినవాడేగాని 20గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గలవాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు. 21యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. 22అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును. 23మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీపింపకూడదు; నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీయకాండము 21: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for లేవీయకాండము 21