లేవీయకాండము 2

2
1ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి 2యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులోనుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలిపీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. 3ఆ నైవేద్యశేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
4నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములేగాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను. 5నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను. 6అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటిమీద నూనె పోయవలెను.
7నీవు అర్పించునదికుండలో వండిన నైవేద్యమైనయెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను. 8వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను 9అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను. 10ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
11మీరు యెహోవాకుచేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. 12ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చునుగాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింప వలదు. 13నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యముమీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను. 14నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. 15అది నైవేద్యరూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను. 16అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీయకాండము 2: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for లేవీయకాండము 2