లేవీయకాండము 17

17
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 2–నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము – ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట 3-4ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొఱ్ఱెయేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును; 5వాడు రక్తమును ఒలికించినవాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యెహోవాపేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించుని ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడవలెను. 6యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. 7వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. 8-9మరియు నీవు వారితో ఇట్లనుము–ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలోగాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.
10మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలోనుండి వాని కొట్టివేయుదును. 11రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును. 12కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
13మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పెట్టినయెడలవాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము; 14దాని రక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. 15మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమివాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును. 16అయితేవాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడలవాడు తన దోషశిక్షను భరించును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీయకాండము 17: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for లేవీయకాండము 17