లేవీయకాండము 14:33-57

లేవీయకాండము 14:33-57 TELUBSI

మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల ఆ యింటి యజమానుడు యాజకునియొద్దకు వచ్చి–నా యింటిలో కుష్ఠుపొడవంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను. అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైననుఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండినయెడల యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను. ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైనయెడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను. అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును. ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనముచేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగుర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తముచేయగా అది పవిత్రమగును. ప్రతివిధమైన కుష్ఠుపొడనుగూర్చియు, బొబ్బనుగూర్చియు వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు, వాపునుగూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చనుగూర్చియు, ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమునుగూర్చిన విధి.