లేవీయకాండము 14:33-57

లేవీయకాండము 14:33-57 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “మీ స్వాస్థ్యంగా నేను మీకు ఇస్తున్న కనాను దేశానికి మీరు వచ్చిన తర్వాత, ఆ దేశంలోని ఒక ఇంట్లో నేను కుష్ఠు మచ్చను ఉంచితే, వెంటనే ఆ ఇంటి యజమాని యాజకుడి దగ్గరకు వెళ్లి, ‘నేను నా ఇంట్లో అపవిత్రమైన మచ్చ చూశాను’ అని చెప్పాలి. ఆ ఇంట్లో ఉన్నదంతా అపవిత్రంగా కాకుండ ఉండడానికి యాజకుడు ఆ మచ్చను పరీక్షించడానికి రాకముందే ఆ ఇళ్ళంతా ఖాళీ చేయించాలి. ఆ తర్వాత యాజకుడు లోపలికి వెళ్లి ఇంటిని పరీక్షించాలి. అతడు గోడలపై ఉన్న మచ్చను పరీక్షించినప్పుడు ఆ గోడల మీద పచ్చని గీతలు గాని ఎర్రని గీతలు గోడ పగుళ్లలో ఉంటే, యాజకుడు ఆ ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్లి ఏడు రోజులు దానిని మూసివేయాలి. ఏడవ రోజున యాజకుడు ఆ ఇంటిని పరిశీలించడానికి మరలా రావాలి. ఒకవేళ గోడలపై మరక వ్యాపించి ఉంటే, మచ్చలు ఉన్న ఆ రాళ్లను ఊడదీసి పట్టణానికి బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయమని యాజకుడు ఆదేశించాలి. అతడు ఇంటి లోపలి గోడలన్నింటిని గీయించి ఆ చెత్తను పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి. తీసివేసిన వాటి స్థానంలో వేరే రాళ్లు పెట్టి క్రొత్త బంకమట్టిని తీసుకుని ఇంటికి అడుసు పూయాలి. “రాళ్లు ఊడదీసి ఇంటి గోడలను గీయించి కొత్త అడుసు పూసిన తర్వాత ఇంట్లో అపవిత్రమైన మరక తిరిగి కనిపిస్తే, యాజకుడు వెళ్లి దానిని పరీక్షించాలి, ఒకవేళ ఇంట్లో మరక వ్యాపించి ఉంటే అది అపవిత్రపరచే మరక; ఆ ఇల్లు అపవిత్రమైనది. ఆ ఇంటిని దాని రాళ్లను కలపను అడుసును కూలగొట్టి వాటిని పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి. “ఒకవేళ ఇల్లు మూసివేసి ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్తే సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు. ఆ ఇంట్లో పడుకునేవారు తినేవారు ఎవరైనా సరే తమ బట్టలు ఉతుక్కోవాలి. “యాజకుడు వచ్చి దానిని పరీక్షించినప్పుడు ఆ ఇంటికి అడుసు పూసిన తర్వాత మరక వ్యాపించకపోతే, అపవిత్రం చేసే మరక పోయింది కాబట్టి ఆ ఇల్లు పవిత్రమని అతడు ప్రకటించాలి. ఇంటిని శుద్ధి చేయడానికి అతడు రెండు పక్షులను కొంచెం దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకోవాలి. అతడు ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపాలి. అప్పుడు అతడు దేవదారు కర్రను హిస్సోపును ఎర్రని నూలును బ్రతికి ఉన్న పక్షిని తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోను మంచినీటిలోను ముంచి ఆ ఇంట్లో ఏడుసార్లు చల్లాలి. అతడు ఇంటిని పక్షి రక్తంతోను మంచినీటితోను బ్రతికి ఉన్న పక్షితో దేవదారు కర్రతో హిస్సోపుతో ఎర్రని నూలుతో శుద్ధి చేయాలి. అప్పుడు అతడు బ్రతికి ఉన్న పక్షిని పట్టణం బయట ఉన్న పొలాల్లో వదలివేయాలి. ఈ విధంగా అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయాలి, అది శుద్ధి అవుతుంది.” ఏదైనా కుష్ఠువ్యాధికైనా గజ్జిపుండ్లకైనా నియమాలు ఇవి, వస్త్రాల్లో గాని ఇంట్లో గాని ఏర్పడే అపవిత్రపరచే మరకలకు, వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా, అవి పవిత్రమైనవా అపవిత్రమైనవా అని ఈ నిబంధనలు తెలియజేస్తాయి. కుష్ఠువ్యాధులు, అపవిత్రపరచే మరకలకు సంబంధించిన నియమాలు ఇవే.

లేవీయకాండము 14:33-57 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత యెహోవా, మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. “నేను మీకు వారసత్వంగా ఇచ్చే కనాను దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఏదైనా ఇంట్లో నేను బూజునూ, తెగులునూ కలిగిస్తే, ఆ యింటి యజమాని యాజకుడి దగ్గరికి వచ్చి, ‘నా ఇంట్లో బూజు వంటిదేదో ఉన్నట్టు నాకన్పిస్తుంది’ అని చెప్పాలి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నదంతా అశుద్ధం కాకుండా ఉండటానికి యాజకుడు వెళ్ళి ఆ ఇంటిని చూడాలి. దానికి ఎదుట యాజకుడు వాళ్ళని ఆ ఇల్లు ఖాళీ చేయమని ఆదేశించాలి. ఆ తరువాత యాజకుడు ఆ ఇంటిని చూడటానికి వెళ్ళాలి. అతడు ఆ బూజుని చూడాలి. అది ఇంటి గోడల పైన పాకిందేమో చూడాలి. అది ఇంటి గోడలపైన ఎర్ర గీతలా గానీ, పచ్చ గీతలా గానీ ఉండి గోడ పగుళ్ళలో ఉంటే యాజకుడు ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఆ ఇంటిని ఏడు రోజులపాటు మూసి ఉంచాలి. ఏడో రోజు యాజకుడు తిరిగి వచ్చి మళ్ళీ పరీక్షించాలి. గోడపైన బూజు వ్యాపించిందేమో పరిశీలించాలి. ఒకవేళ అది వ్యాపిస్తే, ఆ బూజు పట్టిన రాళ్ళను గోడలోంచి తీసి పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయమని యాజకుడు ఆదేశించాలి. ఆ తరువాత ఆ యింటి లోపల చుట్టూ గోడలను గీకించాలి. అలా గీకించిన తరువాత మాలిన్యం అంటిన పెళ్లలను పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయాలి. వేరే రాళ్ళను తెచ్చి తీసివేసిన రాళ్ళ స్థానంలో చేర్చాలి. అలాగే కొత్త అడుసు తెచ్చి ఆ ఇంటి గోడలకు పూయాలి. అతడు ఆ రాళ్లను ఊడదీసి, ఆ ఇల్లు గీకించి, కొత్త అడుసు పూసిన తరువాత మళ్ళీ బూజు కన్పిస్తే యాజకుడు వచ్చి చూడాలి. ఆ ఇల్లంతా బూజు వ్యాపించిందేమో యాజకుడు పరీక్షించాలి. ఒకవేళ బూజు కన్పిస్తే అది హానికరం. ఆ ఇల్లు అశుద్ధం. కాబట్టి ఆ ఇంటిని కూల్చి వేయాలి. ఆ ఇంటి రాళ్ళనూ, కలపనూ, అడుసునూ తీసి పట్టణం బయట ఉన్న అశుద్ధమైన ప్రాంతంలోకి మోసుకు వెళ్ళి పారవేయాలి. దీనికి తోడు ఆ ఇల్లు మూసి ఉన్న సమయంలో ఎవరైనా దానిలో ప్రవేశిస్తే వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధంగా ఉంటారు. ఆ ఇంట్లో నిద్రించేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అలాగే ఆ ఇంట్లో భోజనం చేసేవాడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి. ఒకవేళ యాజకుడు కొత్త అడుసు పూసిన తరువాత ఆ ఇంట్లో బూజు వ్యాపించేదేమో పరీక్షించడానికి వచ్చినప్పుడు, బూజు కన్పించకుంటే ఆ ఇంటిని శుద్ధమైనది గా ప్రకటించాలి. అప్పుడు యాజకుడు ఆ యింటిని శుద్ధీకరణ చేయడానికి రెండు పక్షులనూ, ఒక దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు రెమ్మనూ తీసుకోవాలి. పారే నీళ్ళపైన ఒక మట్టి పాత్రలో ఒక పక్షిని వధించాలి. ఆ దేవదారు కర్రనూ, హిస్సోపు రెమ్మనూ, ఎర్రని నూలునూ, బతికి ఉన్న పక్షినీ తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోనూ, పారే నీళ్ళలోనూ వాటిని ముంచాలి. వాటితో ఆ ఇంటిపైన ఏడు సార్లు చిలకరించాలి. ఆ విధంగా పక్షి రక్తంతో, పారే నీళ్ళతో, బతికి ఉన్న పక్షితో, దేవదారు కర్రతో, హిస్సోపు రెమ్మతో, ఎర్రని నూలుతో ఆ ఇంటిని శుద్ధి చేయాలి. అయితే బతికి ఉన్న పక్షిని పట్టణం బయట మైదానాల్లో వదిలివేయాలి. ఈ విధంగా ఆ ఇంటి కోసం పరిహారం చేయాలి. అప్పుడు ఆ ఇల్లు శుద్ధి అవుతుంది. అన్ని రకాల చర్మ సంబంధిత అంటు వ్యాధులకూ, పొక్కులకూ వస్త్రంలో గానీ, ఇంట్లోగానీ ఏర్పడిన బూజూ, వాపూ, చర్మం రేగి కలిగే మచ్చలూ, నిగనిగలాడే మచ్చలూ వీటికి సంబంధించిన చట్టం ఇది. వీటిలో దేని మూలంగా ఒక వ్యక్తి ఎప్పుడు అశుద్ధుడు అవుతాడో, ఎప్పుడు శుద్ధుడు అవుతాడో ఈ చట్టం వివరిస్తుంది. ఇది చర్మానికి కలిగే అంటువ్యాధులకూ తెగులూ, బూజులకు సంబంధించిన చట్టం.”

లేవీయకాండము 14:33-57 పవిత్ర బైబిల్ (TERV)

మోషే, అహరోనులతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “కనాను దేశాన్ని నేను మీ ప్రజలకు ఇస్తున్నాను. మీ ప్రజలు ఆ దేశం చేరుతారు. ఆ సమయంలో ఎవరి యింట్లోనైనా (ఇంటి గోడకు) నేను కుష్ఠుపొడను పెరగనీయవచ్చు. ఆ యింటి స్వంతదారుడు యాజకుని దగ్గరకు వచ్చి, ‘కుష్ఠుపొడలాంటిది ఏదో నాయింట్లో కనిపిస్తుంది’, అనిచెప్పాలి. “అప్పుడు యాజకుడు ఆ ఇంటి వారిని ఇల్లు ఖాళీచేయమని ఆజ్ఞాపించాలి.” యాజకుడు కుష్ఠుపొడను చూడటానికి వెళ్లక ముందే వారు ఇల్లు ఖాళీచేయాలి. ఈ విధంగా ఆ ఇంట్లోని అపవిత్రమైన వాటన్నింటినీ యాజకుడు కాపాడవలసిన పనిలేదు. ఆ మనుష్యులు ఇల్లు ఖాళీచేసిన తర్వాత, ఆ ఇంటిని చూడటానికి యాజకుడు లోనికి వెళ్లాలి. యాజకుడు కుష్ఠుపొడను పరిశీలించాలి. ఆ ఇంటి గోడలమీద పొడకు పచ్చటి లేక ఎర్రటి రంధ్రాలు ఉండి, ఆ పొడ గోడల ఉపరితలంలో చొచ్చుకు పోతున్నట్లు కనబడితే, యాజకుడు ఆ ఇంటినుండి బయటకు వెళ్లిపోయి ఏడు రోజులవరకు ఆ ఇంటికి తాళంవేయాలి. “ఏడో రోజున యాజకుడు తిరిగి వచ్చి ఆ ఇంటిని పరిశీలించాలి.” ఆ పొడ ఇంటి గోడలమీద వ్యాపించి ఉంటే, పొడ ఉన్న రాళ్లను లాగి పారవేయమని యాజకుడు ఆ ప్రజలకు ఆజ్ఞాపించాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో వారు ఆ రాళ్లను వేయాలి. అప్పుడు యాజకుడు ఆ ఇంటిలోపల అంతా గీకించాలి. అలా గీకిన పెచ్చులను వారు పారవేయాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో ఆ పెచ్చులను వారు వేయాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంటికి కొత్త రాళ్లు పెట్టాలి. అతడు ఆ రాళ్లకు కొత్త అడుసు పూయించాలి. “ఒకవేళ ఒకడు పాతరాళ్లను, పాత పెచ్చులను తీసివేసి, కొత్తరాళ్లు, కొత్త అడుసు పెట్టి ఉండొచ్చు. ఒకవేళ ఆ ఇంటిలో మరల పొడ కనబడవచ్చును. అప్పుడు యాజకుడు లోనికి వచ్చి ఇంటిని పరిశీలించాలి. ఆ పొడ ఇంటిలో వ్యాపించి ఉంటే, అది త్వరగా యితర స్థలాలకు గూడా వ్యాపించే వ్యాధి. అందుచేత ఆ యిల్లు అపవిత్రము. ఆ వ్యక్తి ఆ ఇంటిని కూలగొట్టాలి. ఆ రాళ్లను, పెచ్చులను, చెక్కముక్కలను పట్టణం వెలుపల అపవిత్రమైన ప్రత్యేక స్థలానికి తీసుకొని పోవాలి. ఆ ఇంట్లోకి వెళ్లే ఏ వ్యక్తి అయినాసరే సాయంత్రం వరకు అపవిత్రమవుతాడు. ఎవరైనా ఆ ఇంటిలో భోజనంచేసినా, పండుకొన్నా ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. “ఆ ఇంట్లో కొత్త అడుసుతో కొత్త రాళ్లు వేసిన తర్వాత యాజకుడు ఆ ఇంటిని పరిశీలించాలి. ఒకవేళ ఆ పొడ ఇంటిలో వ్యాపించకపోతే ఆ ఇల్లు పవిత్రం అని యాజకుడు ప్రకటించాలి. ఎందుచేతనంటే ఆ పొడ పోయింది గనుక! “అప్పుడు ఆ ఇంటిని పవిత్రం చేయటానికి యాజకుడు రెండు పక్షులను, దేవదారు చెక్క ముక్కను, ఒక ఎర్ర గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు రెమ్మను తీసుకోవాలి. పారుతున్న నీళ్లలో ఒక మట్టి పాత్రలో యాజకుడు ఒక పక్షిని వధించాలి. తరువాత యాజకుడు దేవదారు చెక్క ముక్కను, హిస్సోపును, ఎర్రగుడ్డ ముక్కను, ప్రాణంతో ఉన్న పక్షిని తీసుకోవాలి. పారుతున్న నీళ్లలో వధించబడిన పక్షి రక్తంలో యాజకుడు వీటన్నింటినీ ముంచాలి. అప్పుడు యాజకుడు ఆ రక్తాన్ని ఇంటిమీద ఏడు సార్లు చిలకరించాలి. ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయటానికి వీటిని ఉపయోగించాలి. యాజకుడు పట్టణం వెలుపలి బయలు ప్రదేశానికి వెళ్లి, బ్రతికి ఉన్న పక్షిని అక్కడ స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయాలి. ఆ ఇల్లు పవిత్రం అవుతుంది.” ఏ విధమైన కుష్ఠువ్యాధికి, బట్టమీద లేక ఇంటి మీద కుష్ఠు పొడకు సంబంధించిన నియమాలు అవి. చర్మంమీద వాపులు, దద్దురులు, నిగనిగలాడే మచ్చలకు అవి నియమాలు. వస్తువులు పవిత్రంగా ఉన్నది లేనిదీ ఆ నియమాలు నేర్పిస్తాయి. అలాంటి వ్యాధులకు సంబంధించిన నియమాలు అవి.

లేవీయకాండము 14:33-57 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల ఆ యింటి యజమానుడు యాజకునియొద్దకు వచ్చి–నా యింటిలో కుష్ఠుపొడవంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను. అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైననుఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండినయెడల యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను. ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైనయెడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను. అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును. ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనముచేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగుర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తముచేయగా అది పవిత్రమగును. ప్రతివిధమైన కుష్ఠుపొడనుగూర్చియు, బొబ్బనుగూర్చియు వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు, వాపునుగూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చనుగూర్చియు, ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమునుగూర్చిన విధి.

లేవీయకాండము 14:33-57 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)