లేవీయకాండము 13

13
1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. 2–ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడినయెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను. 3ఆయాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. 4నిగనిగలాడు మచ్చ చర్మము కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్నయెడలను ఆయాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను. 5ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను. 6ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే,వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. 7అయితేవాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడలవాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. 8అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.
9కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను. 10యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబరచినయెడలను, వాపులో పచ్చి మాంసము కనబడినయెడలను, 11అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణ యింపవలెను, వానిని కడగా ఉంచకూడదు;వాడు అప విత్రుడు. 12కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తలమొదలుకొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండినయెడల 13యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను;వాడు పవిత్రుడు. 14అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమునవాడు అపవిత్రుడు. 15యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచివాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము. 16అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారినయెడలవాడు యాజకునియొద్దకు రావలెను; 17యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను;వాడు పవిత్రుడు.
18ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత 19ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతోకూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దాని కనుపరచవలెను. 20యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రు కలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ. 21యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కనబడినయెడలను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. 22అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ. 23నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడువాడు పవిత్రు డని నిర్ణయింపవలెను.
24దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను. 25నిగ నిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడువాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను; అది కుష్ఠము. 26యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రు కలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయేగాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను. 27ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడలవాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే. 28అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే;వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.
29పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా 30అది చర్మముకంటె పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడినయెడల,వాడు అపవిత్రు డని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీద నేమి గడ్డముమీద నేమి పుట్టిన కుష్ఠము. 31యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచినప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేనియెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 32ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను, 33వాడు క్షౌరము చేసికొనవలెనుగాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 34ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లముకాక యుండినయెడల, యాజకుడువాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. 35వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాని చూడవలెను, 36అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు;వాడు అపవిత్రుడు. 37అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టినయెడల ఆ మాద బాగుపడెను;వాడు పవిత్రుడు; యాజకుడువాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
38మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల 39యాజకుడు వానిని చూడవలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు;వాడు పవిత్రుడు.
40తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయిననువాడు పవిత్రుడు. 41ముఖమువైపున తలవెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు;వాడు పవిత్రుడు. 42అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టినయెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్ఠము. 43యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగా నుండు తెల్లని పొడయైనయెడల 44వాడు కుష్ఠరోగి,వాడు అపవిత్రుడు; యాజకుడువాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది.
45ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను;వాడు తల విరియబోసికొనవలెను;వాడు తన పైపెదవిని కప్పుకొని–అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. 46ఆ పొడ వానికి కలిగిన దినములన్నియువాడు అపవిత్రుడైయుండును;వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.
47మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱెవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి 48నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి 49ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను. 50యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 51ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. 52కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతోచేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను. 53అయితే యాజకుడు చూచి నప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల 54యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను. 55ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. 56యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. 57అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. 58ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికినతరువాత ఆ పొడ వదిలినయెడల, రెండవమారు దానిని ఉదుకవలెను; 59అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట యందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠు పొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణ యింపవలసిన విధి యిదే.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీయకాండము 13: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for లేవీయకాండము 13