యెహోషువ 6
6
1ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. 2అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను–చూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను. 3మీరందరు యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగవలెను. 4ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవదినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆయాజకులు బూరల నూదవలెను. 5మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. 6నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి–మీరు నిబంధనమందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను. 7మరియు అతడు–మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. 8యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధనమందసమును వారివెంట నడిచెను. 9యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి. 10మరియు యెహోషువ–మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. 11అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి.
12ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి. 13ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి. 14అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములువారు ఆలాగు చేయుచువచ్చిరి. 15ఏడవదినమునవారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి 16ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. 17ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు. 18శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనినయెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. 19వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.
20యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. 21వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరిని యెద్దులను గొఱ్ఱెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. 22అయితే యెహోషువ–ఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన యిద్దరు మనుష్యులతో చెప్పగా 23వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగినవారినందరిని వెలుపలికి తోడుకొని వచ్చిరి; ఆమె యింటివారినందరిని వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెమువెలుపట వారిని నివసింపజేసిరి. 24అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి; వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుపపాత్రలను మాత్రమే యెహోవామందిర ధనాగారములో నుంచిరి. 25రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి యుండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి యింటివారిని ఆమెకు కలిగినవారినందరిని బ్రదుకనిచ్చెను. ఆమె నేటివరకు ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నది.
26ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెను–ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును; 27యెహోవా యెహోషువకు తోడై యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 6: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.