యెహోషువ 5

5
1వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటిదిక్కుననున్న అమోరీయుల రాజులందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీయుల భయముచేత వారికిక ధైర్యమేమియు లేక పోయెను.
2ఆ సమయమున యెహోవా–రాతికత్తులు చేయించుకొని మరల ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా 3యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. 4యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులోనుండి బయలుదేరినవారందరిలో యుద్ధసన్నద్ధులైన పురుషులందరు ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. 5బయలుదేరిన పురుషులందరు సున్నతి పొందినవారే కాని ఐగుప్తులోనుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొందియుండలేదు. 6యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధులందరు యెహోవా మాట వినకపోయినందునవారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. 7ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది యుండలేదు గనుక వారికి సున్నతి చేయించెను; ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు. 8కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడువరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి. 9అప్పుడు యెహోవా–నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతోననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గా లను#5:9 దొరలించిన. పేరు.
10ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి. 11పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్యములను తినిరి. 12మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను; అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమునవారు కనానుదేశపు పంటను తినిరి.
13యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేతపట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లి–నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా 14అతడు–కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసి–నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను. 15అందుకు యెహోవా సేనాధిపతి –నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ ఆలాగు చేసెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 5: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహోషువ 5 కోసం వీడియో