యెహోషువ 12:1-6

యెహోషువ 12:1-6 TELUBSI

ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోనుకొండవరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువరకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానమువరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయులయొక్కయు మాయకాతీయులయొక్కయు సరిహద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దువరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.