యెహోషువ 10:7-14

యెహోషువ 10:7-14 TELUBSI

యెహో షువయును అతనియొద్దనున్న యోధులందరును పరాక్రమ ముగల శూరులందరును గిల్గాలునుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా–వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ యెదుట నిలువడని యెహోషువతో సెలవియ్యగా యెహోషువ గిల్గాలునుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠా త్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్‍హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్‍హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మంది యయిరి. యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను– సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి యున్నది గదా. –సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచియించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.