యోవేలు 2:12-17

యోవేలు 2:12-17 TELUBSI

ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు –యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు–వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.