యోబు 9

9
1అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2–వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.
నరుడు దేవునిదృష్టికి ఎట్లు నిర్దోషియగును?
3వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడల
వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు
ఉత్తరమియ్యలేడు.
4ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు
ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
5వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు
ఆయనే
ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే
6భూమిని దాని స్థలములోనుండి కదలించువాడు
ఆయనే
దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే
7ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా
అతడు ఉదయింపడు
ఆయన నక్షత్రములను మరుగుపరచును.
8ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచు
వాడు
సముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.
9ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ
నక్షత్రరాసులను చేసినవాడు.
10ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను
లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయనచేయు
చున్నాడు.
11ఇదిగో ఆయన నా సమీపముగ గడచిపోవుచున్నాడు
గాని నేనాయనను కనుగొనలేను
నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు
కనబడడు.
12ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవా
డెవడు?
–నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవా
డెవడు?
13దేవుని కోపము చల్లారదు
రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.
14కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి
వాడను?
ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకు
టకు నేనేపాటివాడను?
15నేను నిర్దోషినైయుండినను ఆయనకు ప్రత్యుత్త
రము చెప్పజాలను
న్యాయకర్తయని#9:15 ప్రతివాది. నేనాయనను బతిమాలుకొనదగును.
16నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను
ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
17ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు
చున్నాడు
నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయు
చున్నాడు
18ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు
చేదైనవాటిని నాకు తినిపించును.
19బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా–నేనే
యున్నానని ఆయన యనును
న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా–ప్రతివాదిగా
నుండ తెగించువాడెవడని ఆయన యనును?
20నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నా
మీద నేరము మోపును
నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన#9:20 అవి. నన్ను
నిరూపించును.
21నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదు
నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.
22ఏమి చేసినను ఒక్కటే.
కావున–యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము
లేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని
నేను వాదించుచున్నాను.
23సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము
చేయగా
నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.
24భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ
ఆయన చేయును.
ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి
ఎవడు?
25పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా
గతించుచున్నవి
క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.
26రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును
ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.
27–నా శ్రమను మరచిపోయెదననియు
దుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగా
నుండెదననియు నేను అనుకొంటినా?
28నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను
నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను
29నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా
కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?
30నేను హిమముతో నన్ను కడుగుకొనినను
సబ్బుతో నా చేతులు కడుగుకొనినను
31నీవు నన్ను గోతిలో ముంచెదవు
అప్పుడు నేను నా స్వంతవస్త్రములకే అసహ్యుడనగుదును.
32ఆయన నావలె నరుడు కాడు
నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను
మేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.
33మా యిద్దరిమీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.
34ఆయన తన దండమును నామీదనుండి తీసివేయ
వలెను
నేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహా
త్మ్యమును నాకు కనుపరచకుండవలెను.
35అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను,
ఏలయనగా నేను అట్టివాడను కాననుకొను
చున్నాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 9: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in