యోబు 6:1-30

యోబు 6:1-30 TELUBSI

దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను– నా దుఃఖము చక్కగా తూచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా? ఎద్దు మేత చూచి రంకెవేయునా? ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డు లోని తెలుపులో రుచికలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొన కుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల? నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా. క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడనివారైరి. మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమై పోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియు లేకుండ అవి యింకిపోవును. సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. –ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా? పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా? నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా. మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు, మీ స్నేహితులమీద బేరము సాగింతురు. దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయములేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?