యోబు 15
15
1అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున
ప్రత్యుత్తరమిచ్చెను–
2జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తర
మియ్యదగునా?
తూర్పుగాలితో తన కడుపు నింపుకొన దగునా?
3వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా?
నిష్‌ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా?
4నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు.
దేవునిగూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.
5నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది.
వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.
6నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి
నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.
7మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?
నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?
8నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా?
నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
9మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు?
మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?
10నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు
మీరిన పురుషులును మాలో నున్నారు
నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.
11దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా?
ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము
తేలికగా నున్నదా?
12నీ హృదయము ఏల క్రుంగిపోయెను?
నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?
13దేవునిమీద నీవేల ఆగ్రహపడుచున్నావు?
నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?
14శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు?
నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?
15ఆలోచించుము ఆయన తన దూతలయందు నమ్మిక
యుంచడు.
ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.
16అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు
త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి
అపవిత్రుడు గదా.
17నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును
నేను చూచినదానిని నీకు వివరించెదను.
18జ్ఞానులు తమపితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక
చెప్పిన బోధను నీకు తెలిపెదను.
19అన్యులతో సహవాసము చేయక
తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన
జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.
20తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును
హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు
బాధనొందును.
21భీకరమైన ధ్వనులు వాని చెవులలోబడును, క్షేమ
కాలమున పాడుచేయువారు వాని మీదికి
వచ్చెదరు.
22తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు
వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.
23అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు
తిరుగులాడును.
అంధకారదినము సమీపించుచున్నదని వానికి
తెలియును.
24శ్రమయు వేదనయు వానిని బెదరించును.
యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని
పట్టుకొనునట్లు అవి వానిని పట్టుకొనును.
25వాడు దేవునిమీదికి చేయి చాపును
సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.
26మూర్ఖుడై ఆయనను మార్కొనును
తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.
27వాని ముఖము క్రొవ్వు పెట్టియున్నది
వాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగి
యున్నవి.
28అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు
ఎవరును నివసింపకూడని యిండ్లలో
దిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు
29కావునవారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి
నిలువదు.వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు
30వారు చీకటిని తప్పించుకొనరు
అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును
దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.
31వారు మాయను నమ్ముకొనకుందురు గాక; వారు మోసపోయినవారు
మాయయే వారికి ఫలమగును.
32వారి కాలము రాకముందే అది జరుగును
అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.
33ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని
రాల్చును.
ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని
రాల్చును.
34భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును.
లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును
35వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము
కందురువారి కడుపున కపటము పుట్టును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 15: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.