యోబు 1
1
1ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు. 2అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి. 3అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. 4అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమతమ యిండ్లలో విందుచేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. 5వారి వారి విందుదినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.
6దేవదూతలు#1:6 మూలభాషలో–దైవకుమారులు. యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది#1:6 మూలభాషలో–సాతాను.యగు వాడు వారితో కలిసి వచ్చెను. 7యెహోవా–నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది–భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను. 8అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు 9అని అడుగగా అపవాది–యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? 10నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతనిచేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.
11అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా 12యెహోవా–ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికిమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.
13ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానముచేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి 14–ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీదపడి వాటిని పట్టుకొనిపోయి 15ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. 16అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి–దేవుని అగ్ని ఆకా శమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. 17అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి–కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీదపడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. 18అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి– నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానముచేయుచుండగా 19గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యౌవనులమీద పడినందునవారు చనిపోయిరి; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. 20అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను 21–నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. 22ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 1: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.