యోహాను 7:1-24

యోహాను 7:1-24 TELUBSI

అటుతరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి–నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యు లును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. యేసు–నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకనుపరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. పండుగలో యూదులు–ఆయన ఎక్కడ నని ఆయనను వెదకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొంద రాయన మంచివాడనిరి; మరికొందరు–కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి; అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి–చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు–నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము–నీవు దయ్యము పెట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి–నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.