యోహాను 7:1-24
యోహాను 7:1-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ తర్వాత, యేసు గలిలయల ప్రాంతంలోనే తిరుగుతున్నారు. యూదా నాయకులు ఆయనను చంపాలని ఎదురు చూస్తున్నారని యేసు యూదయ ప్రాంతాలకు వెళ్లకూడదనుకున్నారు. కానీ యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడినప్పుడు, యేసుని సహోదరులు ఆయనతో, “గలిలయల వదిలి యూదయకు వెళ్లు. అప్పుడు అక్కడ ఉన్న నీ శిష్యులు నీవు చేసిన కార్యాలు చూస్తారు. అందరిలో ప్రసిద్ధి పొందాలని కోరుకునే వారెవరు రహస్యంగా కార్యాలను చేయరు. నీవు ఈ కార్యాలను చేస్తున్నావు, లోకానికి నీ గురించి తెలిసేలా చేయి” అన్నారు. ఎందుకంటే ఆయన సహోదరులు కూడా ఆయనను నమ్మలేదు. అందుకు యేసు వారితో, “నా సమయం ఇంకా రాలేదు; కానీ మీ సమయం ఎప్పుడైనా ఉంటుంది. ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నేను దాని పనులు చెడ్డవని సాక్ష్యమిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది. మీరు పండుగకు వెళ్లండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి నేను ఈ పండుగకు ఇప్పుడే రాను” అని చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఆయన గలిలయలో ఉన్నారు. అయితే తన సహోదరులు పండుగకు వెళ్లిన తర్వాత, బహిరంగంగా కాకుండా రహస్యంగా ఆయన కూడా వెళ్లారు. పండుగలో యూదా నాయకులు యేసుని వెదకుతూ, “ఆయన ఎక్కడ?” అని అడుగుతున్నారు. ఆ జనసమూహంలో ఆయన గురించి గుసగుసలు మొదలయ్యాయి. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు. అయితే యూదా నాయకులకు భయపడి ఎవరు ఆయన గురించి బహిరంగంగా ఏమి మాట్లాడలేదు. పండుగ ఉత్సవాలు సగం రోజులు పూర్తియైన తర్వాత యేసు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న యూదులు ఆశ్చర్యపడి, “చదువుకోని వానికి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది?” అని అడిగారు. అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది. దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నవారు నా బోధలు దేవుని నుండి వచ్చాయా లేదా నా సొంతంగా మాట్లాడుతున్నానా అనేది గ్రహిస్తారు. సొంతగా మాట్లాడేవారు తన ఘనత కొరకే అలా చేస్తారు, కాని తనను పంపినవాని ఘనత కోసం చేసేవాడు సత్యవంతుడు; ఏ అబద్ధానికి ఆయనలో చోటు ఉండదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయితే మీలో ఎవ్వరూ ధర్మశాస్త్రాన్ని పాటించడంలేదు. మీరు ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు?” అన్నారు. అందుకు జనసమూహం, “నీకు దయ్యం పట్టింది, నిన్ను ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారు?” అన్నారు. యేసు వారితో, “నేను ఒక అద్భుతాన్ని చేశాను. అందుకు మీరు ఆశ్చర్యపోయారు. అయితే మోషే మీకు సున్నతి ఆచారాన్ని ఇచ్చాడు. వాస్తవానికి అది మోషే నుండి రాలేదు, కాని మీ పితరుల నుండి వచ్చింది. అయినా సబ్బాతు దినాన మీరు ఒక మగ శిశువుకు సున్నతి చేస్తున్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మీరు సబ్బాతు దినాన ఒక మగ శిశువుకు సున్నతి చేస్తే, నేను సబ్బాతు దినాన ఒక వ్యక్తి దేహాన్నంతటిని బాగుచేసినందుకు నాపై ఎందుకు కోప్పడుతున్నారు? కేవలం పైరూపాన్ని చూసి విమర్శించడం మాని న్యాయంగా తీర్పు తీర్చండి” అని అన్నారు.
యోహాను 7:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరువాత యేసు గలిలయకు వెళ్ళి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదయలో యూదులు ఆయనను చంపాలని వెతుకుతూ ఉండటంతో అక్కడ సంచరించడానికి ఆయన ఇష్టపడలేదు. ఇంతలో యూదుల పర్ణశాలల పండగ సమీపించింది. అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో, “నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే ఈ స్థలం వదిలి యూదయకు వెళ్ళు. అందరూ మెచ్చుకోవాలని చూసేవాడు తన పనులు రహస్యంగా చేయడు. నువ్వు నిజంగా ఈ కార్యాలు చేస్తున్నట్టయితే లోకమంతటికీ తెలిసేలా చెయ్యి. నిన్ను నువ్వే చూపించుకో” అన్నారు. ఆయన తమ్ముళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచలేదు. అప్పుడు యేసు, “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది. మీరు పండక్కి వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండక్కి ఇప్పుడే వెళ్ళను” అని వారితో చెప్పాడు. వారికి ఇలా చెప్పి ఆయన గలిలయలో ఉండిపోయాడు. కానీ తన తమ్ముళ్ళు పండక్కి వెళ్ళిన తరువాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా వెళ్ళాడు. ఆ ఉత్సవంలో యూదులు ‘ఆయన ఎక్కడ ఉన్నాడు’ అంటూ ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. ప్రజల మధ్య ఆయనను గురించి పెద్ద వాదం ప్రారంభమైంది. కొందరేమో, “ఆయన మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు. ఆయన మోసగాడు” అన్నారు. అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బయటకు మాట్లాడలేదు. పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి, “చదువూ సంధ్యా లేని వాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది” అని చెప్పుకున్నారు. దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే. దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు. తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా! కానీ మీలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించరు. మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు?” అన్నాడు. అందుకు ఆ ప్రజలు, “నీకు దయ్యం పట్టింది. నిన్ను చంపాలని ఎవరు కోరుకుంటారు?” అన్నారు. యేసు వారితో, “నేనొక కార్యం చేశాను. దానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు. మోషే మీకు సున్నతి అనే ఆచారాన్ని నియమించాడు. ఈ ఆచారం మోషే వల్ల కలిగింది కాదు. ఇది పూర్వీకుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినాన మీరు సున్నతి కార్యక్రమం చేస్తున్నారు. విశ్రాంతి దినాన సున్నతి పొందినా మోషే ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించినట్టు కాదు గదా! అలాంటప్పుడు నేను విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే నా మీద ఎందుకు కోపం చూపుతున్నారు? బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి” అన్నాడు.
యోహాను 7:1-24 పవిత్ర బైబిల్ (TERV)
ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చెయ్యలేదు. యూదుల పర్ణశాలల పండుగ దగ్గరకు వచ్చింది. యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు. నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, ప్రజానాయకుడు కాదలచినవాడు రహస్యంగా కార్యంచేయడు” అని అన్నారు. అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట! యేసు వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ సమయమైనా మంచిదే. ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది. మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు. ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయులోనే ఉండి పోయాడు. ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండుగకు వెళ్ళాడు. కాని బహిరంగంగా కాదు. రహస్యంగా. అక్కడ పండుగ జరుగే స్థలంలో యూదులు, “అతడెక్కడున్నాడు?” అని అంటూ ఆయన కోసం వెదకసాగారు. ప్రజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు ఆయన మంచివాడన్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు!” అని అన్నారు. యూదులకు భయపడి ఆయన్ని గురించి బహిరంగంగా ఎవ్వడూ ఏమీ అనలేదు. పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించటం మొదలుపెట్టాడు. యూదులు ఆశ్చర్యపడి, “చదవకుండా యితడు యింత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాడు” అని అన్నారు. యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి. దైవేచ్చానుసారం జీవించ దలచిన వానికి నా బోధనలు దేవునివా లేక నేను స్వయంగా నా అధికారంతో మాట్లాడుతున్నానా అన్న విషయం తెలుస్తుంది. స్వతహాగా మాట్లాడేవాడు గౌరవం సంపాదించాలని చూస్తాడు. కాని తనను పంపిన వాని గౌరవం కోసం మాట్లాడేవాడే నిజమైనవాడు. అలాంటి వాడు అసత్యమాడడు. మోషే మీకు ధర్మశాస్త్రాన్ని అందించాడు కదా! అయినా మీలో ఒక్కడు కూడా దాన్ని పాటించలేదు. నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు” అని అన్నాడు. “నీకేమన్నా దయ్యం పట్టిందా? నిన్ను చంపటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?” అని ప్రజలు అన్నారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నేను ఒక మహత్కార్యాన్ని చేసాను. దానికే మీరింత ఆశ్చర్యపడిపోయారు. మోషే మీకు సున్నతి చేయించుకోమని చెప్పాడు. నిజానికి యిది మోషే నుండి కాదు కాని పితరులనుండి ప్రారంభమైనది. కనుక అవసరమైతే మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తే తప్పుకాదు కాని, నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయంచేసినందుకు మీకు కోపం వస్తోంది? పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.”
యోహాను 7:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అటుతరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి–నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యు లును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. యేసు–నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకనుపరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను. ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. పండుగలో యూదులు–ఆయన ఎక్కడ నని ఆయనను వెదకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొంద రాయన మంచివాడనిరి; మరికొందరు–కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి; అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి–చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు–నేనుచేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము–నీవు దయ్యము పెట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి–నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.