యోహాను 19:1-22

యోహాను 19:1-22 TELUBSI

అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి–యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి. పిలాతు మరల వెలుపలికి వచ్చి–ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు– ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి–సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు–ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు–మాకొక నియ మము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పు కొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి యెక్కు వగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి –నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు–నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను. అందుకు యేసు–పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులు–నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి. పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు–ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు–ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు–మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు–కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనినిమధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి. మరియు పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. –నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని–యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు–నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.