యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములనుగూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి–మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైయుండి –మీ కేమియు తెలియదు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే యీలాగు చెప్ప లేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను. మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి–మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.
Read యోహాను 11
వినండి యోహాను 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 11:38-57
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు