యిర్మీయా 35
35
1యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్దనుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై 2–నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి, త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవియ్యగా 3నేను, యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారుల నందరిని, అనగా రేకాబీయుల కుటుంబికులనందరిని, తోడుకొని వచ్చితిని. 4యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను. 5నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి – ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా 6వారు–మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా దాబు–మీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. 7మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞా పించెను. 8కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటనుబట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు. 9మా తండ్రియైన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమునుబట్టి మేము విధేయులమగు నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షా వనములుగాని పొలములుగాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు 10గుడారములలోనే నివసించుచున్నాము. 11అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనులదండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి.
12అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా 13–నీవు వెళ్లి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము–యెహోవా వాక్కు ఇదే–మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? యిదే యెహోవా వాక్కు. 14ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటివరకు తమపితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు; అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. 15మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు – ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీపితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి 16రేకాబు కుమారుడైన యెహోనా దాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని యీ ప్రజలు నా మాట వినకయున్నారు. 17కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరమియ్యకపోయిరి గనుక యూదావారిమీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారిమీదికి రప్పించుచున్నాను. 18మరియు యిర్మీయా రేకాబీయులను చూచి యిట్లనెను–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీరు మీ తండ్రియైన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మీకాజ్ఞా పించిన సమస్తమును అనుసరించుచున్నారు. 19కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడునుండక మానడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 35: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.