యిర్మీయా 29

29
1రాజైన యెకోన్యా తల్లియగు రాణియు, రాజ పరివారమును, 2-3యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను, హిల్కీయా కుమారుడైన గెమర్యాచేతను, యెరూషలేములోనుండి చెరపట్టబడిపోయినవారి పెద్దలలో శేషించినవారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేమునుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవే 4–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా తన ప్రేరేపణచేత బబులోనునకు చెరతీసికొని పోబడినవారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు 5–ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, 6పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. 7నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. 8ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీ మధ్యనున్న ప్రవక్తలచేతనైనను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. 9వారు నా నామమునుబట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు. 10యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. 11నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. 12మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. 13మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు, 14నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపెట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును. 15బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే, 16సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజునుగూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహోదరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు 17సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను వారిమీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను; కుళ్లి కేవలము చెడిపోయి తినశక్యముకాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేనువారిని అప్పగించుచున్నాను; 18యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులచేత వారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి. 19గనుక నేను ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును; నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయకారణముగాను అపహాస్యా స్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 20నేను యెరూషలేములోనుండి బబులోనునకు చెరగొని పోయినవారలారా, మీరందరు యెహోవా ఆజ్ఞను ఆలకించుడి.
21నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబునుగూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియానుగూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు 22ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారికాజ్ఞాపింపని అబద్ధపుమాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి, నేనే యీ సంగతిని తెలిసికొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతముచేయును; 23చెరపట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబువలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.
24నెహెలామీయుడైన షెమయాకు నీవీమాట తెలియజేయుము 25–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– 26వెఱ్ఱివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవామందిర విషయములలో పైవిచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములోనున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. 27అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి? 28అతడు తన్నుతాను మీకు ప్రవక్త నుగా చేసికొనెనుగదా అదియుగాక–దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు, 29అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్తయైన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను 30అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 31చెరలోనున్న వారికందరికి నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలామీయుడైన షెమయానుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు–నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపుమాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 32–నెహెలామీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండువాడొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేనుచేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 29: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యిర్మీయా 29 కోసం వీడియో