యిర్మీయా 27

27
1యూదారాజైన యోషీయా కుమారుడగు . యెహోయాకీము#27:1 కొన్ని ప్రాచీన ప్రతులలో సిద్కియా అను పాఠాంతరము. ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 2–యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు– నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. 3వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము. 4మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము–మీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా 5–అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను. 6ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులను కూడ అతని వశము చేయుచున్నాను. 7అతని స్వదేశమునకు కాలమువచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు. 8ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతనిచేత బొత్తిగా నాశనముచేయించువరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు. 9కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి. 10మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. 11అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
12నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని – బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైనయెడల మీరు బ్రదుకుదురు 13బబులోనురాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలును చావనేల? 14కావున– మీరు బబులోనురాజునకు దాసులుకాకుందురని మీతోచెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు. 15నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించునట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజలందరితోను నేను ఈ మాటలు చెప్పితిని 16–యెహోవా సెలవిచ్చునదేమనగా–యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచించు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి. 17వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల? 18వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపో బడకుండునట్లువారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు. 19బబులోను రాజైన నెబుకద్రె జరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు 20అతడు విడిచిపెట్టిన స్తంభములనుగూర్చియు సముద్రమునుగూర్చియు గడమంచెలనుగూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములనుగూర్చియు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 21యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు ననే సెలవిచ్చుచున్నాడు 22–అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలమువరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 27: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యిర్మీయా 27