యిర్మీయా 2:1-13

యిర్మీయా 2:1-13 TELUBSI

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాయందు ఏ దుర్నీతి చూచి మీపితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి? ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్‍ప్రయోజనమైనవాటిని అనుసరింతురు కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.