యెషయా 37

37
1హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకుపోయి 2గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయాయొద్దకు పంపెను. 3వీరు గోనెపట్ట కట్టుకొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి– హిజ్కియా సెలవిచ్చునదేమనగా–ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. 4జీవముగల దేవుని దూషించుటకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. 5రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా 6యెషయా వారితో ఇట్లనెను–మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–అష్షూరురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. 7అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును.
8అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను. 9అంతట కూషురాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను. 10–యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడి–యెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము. 11అష్షూరురాజులు సకలదేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా? 12నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులుగాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా? 13హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి 14హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి 15యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను– 16యెహోవా, కెరూబులమధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకలరాజ్యములకు దేవుడవై యున్నావు. 17సైన్యములకధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము. 18యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి 19వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లుగాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి. 20యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనులు తెలిసికొనునట్లు అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.
21అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను–ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే. 22అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా–
సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయు చున్నది
ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది
యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.
23నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి?
నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి?
ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవునినే గదా?
24నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు
పలికితివి
నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర
ములమీదికిని
లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను
ఎత్తుగల దాని దేవదారు వృక్షములను
శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను
వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని
కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని
ప్రవేశించియున్నాను.
25నేను త్రవ్వి నీళ్లు పానముచేసియున్నాను
నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల
నన్నిటిని ఎండిపోచేసియున్నాను
26నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు
పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు
నీకు వినబడలేదా?
ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ
లుగా చేయుట నా వలననే సంభవించినది.
27కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి.
విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను
కాడవేయని చేలవలెను అయిరి.
28నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు
లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును
నాకు తెలిసేయున్నవి.
29నామీద నీవు వేయు రంకెలును
నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను
నా గాలము నీ ముక్కునకు తగిలించెదను
నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను
నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
30మరియు యెషయా చెప్పినదేమనగా–హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనమువిత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు. 31యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. 32శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు, తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. 33కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు. 34ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు. 35నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. 36అంతట యెహోవాదూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్షయెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి. 37అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత 38అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 37: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

Video for యెషయా 37