ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులువారిని కలిసికొందురువారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమునవారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురువారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి తమ్మును బాధించినవారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనము లను లోబరచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని నిన్నుగూర్చి తమాలవృక్షములు లెబానోను దేవదారువృక్షములు హర్షించును నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరిని వారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది వారందరు నిన్ను చూచి–నీవును మావలె బలహీనుడ వైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? –నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
చదువండి యెషయా 14
వినండి యెషయా 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 14:1-15
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు