హెబ్రీయులకు 7
7
1రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రా హామును 2-3ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు#7:2-3 మూలభాషలో–దినములకు. ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.
4ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రా హాము అతనికి కొల్లగొన్న శ్రేప్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను. 5మరియు లేవి కుమాళ్లలోనుండి యాజ కత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చు కొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని 6వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రా హామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను. 7తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది. 8మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. 9అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను. 10ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.
11ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆయాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? 12ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. 13ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయ లేదు. 14మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులనుగూర్చి మోషే యేమియు చెప్పలేదు. 15-16మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింప బడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. 17ఏలయనగా
–నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున
యాజకుడవై యున్నావు
అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను. 18-19ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేప్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము. 20-22మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేప్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణములేకుండ యాజకులగుదురు గాని యీయన
–నీవు నిరంతరము యాజకుడవై యున్నావని
ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చా త్తాపపడడు
అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. 23మరియు ఆయాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని 24ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. 25ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
26పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.#7:26 లేక, తగినవాడు. 27-28ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీయులకు 7: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.