విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది. దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి. ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేప్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లుకొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రా హాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను. వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా? వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లు టకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేప్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, –ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.
చదువండి హెబ్రీయులకు 11
వినండి హెబ్రీయులకు 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: హెబ్రీయులకు 11:1-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు