ఆదికాండము 33

33
1యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును. అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి. 2అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి 3తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించువరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను. 4అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి. 5ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి –వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. 6అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. 7లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. 8ఏశావు–నాకు ఎదురుగావచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు–నా ప్రభువు కటాక్షము నామీద వచ్చుటకే అని చెప్పెను. 9అప్పుడు ఏశావు–సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను. 10అప్పుడు యాకోబు–అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా; 11నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్త గించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని 12–మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా 13అతడు–నాయొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును. 14నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను. 15అప్పుడు ఏశావు–నీ కిష్టమైనయెడల నాయొద్దనున్న యీ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా–అతడు అదియేల? నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను. 16ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను. 17అప్పుడు యాకోబు సుక్కోతుకు#33:17 పాకలు. ప్రయాణమై పోయి తనకొక యిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. 18అట్లు యాకోబు పద్దనరాములోనుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. 19మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని 20అక్కడ ఒక బలిపీఠముకట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు#33:20 అనగా, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అను పేరు పెట్టెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆదికాండము 33: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in