ఆదికాండము 11:1-9

ఆదికాండము 11:1-9 TELUBSI

భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు–మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించు కొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా–ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదర గొట్టెను.

ఆదికాండము 11:1-9 కోసం వీడియో