ఆదికాండము 11:1-9
ఆదికాండము 11:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
భూలోకమంతా ఒకే భాష ఒకే యాస ఉంది. ప్రజలు తూర్పు వైపునకు ప్రయాణమై వెళ్తుండగా, షీనారు దేశంలో ఒక మైదానాన్ని కనుగొని అక్కడే స్థిరపడ్డారు. వారు ఒకరితో ఒకరు, “రండి ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాం” అని చెప్పుకున్నారు. వారు రాళ్లకు బదులు ఇటుకలు, అడుసుకు బదులుగా కీలుమట్టి వాడారు. అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు. అయితే యెహోవా మనుష్యులు కట్టుకుంటున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడటానికి క్రిందికి దిగి వచ్చారు. యెహోవా, “ఒకవేళ ప్రజలు ఒకే భాష మాట్లాడుతూ ఇది చేయడం ప్రారంభిస్తే, అప్పుడు వారు చేద్దామనుకుంది ఏదైనా వారికి అసాధ్యం కాదు. రండి, మనం క్రిందికి వెళ్లి వారి భాషను తారుమారు చేద్దాం, అప్పుడు ఒకరి సంభాషణ ఒకరు అర్థం చేసుకోలేరు” అని అన్నారు. కాబట్టి యెహోవా వారిని భూమి అంతట చెదరగొట్టారు, వారు పట్టణ నిర్మాణం ఆపివేశారు. యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు.
ఆదికాండము 11:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు. వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు. యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు. యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు. కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు. ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది. అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
ఆదికాండము 11:1-9 పవిత్ర బైబిల్ (TERV)
జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు. తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బ్రతుకుదెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు. “మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి” అనుకొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు కాక తారు ఉపయోగించారు. అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం. ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.” ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. యెహోవా ఇలా అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్లు నాకు కనబడుతోంది. వారు చేయగలిగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించినదేదైనా చేయ గలుగుతారు. అందుచేత మనం క్రిందికి వెళ్లి, వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు.” ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్లు యెహోవా చేశాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ఆ ప్రజలు ముగించలేకపోయారు. మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.
ఆదికాండము 11:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు–మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించు కొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా–ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదర గొట్టెను.