గలతీయులకు 5

5
1ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి.
2చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. 3ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతిమనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను. 4మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు. 5ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము. 6యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. 7మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? 8ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు. 9పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. 10మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. 11సహోదరులారా, సున్నతి పొందవలెనని నే నింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? 12మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు.
13సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. 14ధర్మశాస్త్ర మంతయు–
నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము
అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది. 15అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచు కొనుడి.
16నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 17శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయ కుందురు. 18మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. 19శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 20విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 21భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. 22అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 23-24ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు.
25మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. 26ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

గలతీయులకు 5: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

Video for గలతీయులకు 5