ఎజ్రా 6
6
1అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుకొట్టులో వెదకగా 2మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.
3–రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములోఉండు దేవుని మందిరమునుగూర్చి నిర్ణయించినది–బలులు అర్పింపతగిన స్థలముగా మందిరముకట్టింపబడవలెను; దాని పునాదులు గట్టిగా వేయబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను; 4మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానులచేతను కట్టింపబడవలెను; దాని వ్యయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను. 5మరియు యెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసికొని వచ్చిన దేవుని మందిరముయొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను.
6కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను– నది యవతల అధికారియైన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును నది యవతల మీతోకూడ నున్న అపర్సెకాయులును యూదులజోలికి పోక 7దేవుని మందిరపు పని జరుగనిచ్చి, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింప నియ్యుడి. 8మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదులయొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమునుగూర్చి మేము నిర్ణయించినదేమనగా–రాజుయొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయుపని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసినదాని ఇయ్యవలెను. 9మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొఱ్ఱెపొట్టేళ్లేగాని గొఱ్ఱెపిల్లలేగాని గోధుమలేగాని ఉప్పేగాని ద్రాక్షారసమేగాని నూనెయేగాని, యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ 10వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. 11ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటివెన్నుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును, ఆ తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయబడును. 12ఏ రాజులేగాని యేజనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.
13అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారునురాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి. 14యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీకదేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి. 15రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను. 16అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. 17దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రాయేలీయులకందరికిని పాపపరిహారార్థబలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేకపోతులను అర్పించిరి. 18మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషేయొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.
19చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవదినమున పస్కాపండుగ ఆచరించిరి. 20యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత, చెరలోనుండి విడుదలనొందిన వారందరికొరకును తమ బంధువులైన యాజకులకొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి. 21కావున చెరలోనుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి,తిని పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి. 22ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎజ్రా 6: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.