యెహెజ్కేలు 41
41
1తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని. వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు. 2వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు. 3అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు; వెడల్పు ఏడు మూరలు. 4–ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలునాయెను. 5తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను. 6ఈ మేడగదులు మూడేసి అంతస్థులు గలవి. ఈలాగున ముప్పది గదులుండెను, ఇవి మేడ గదులచోటున మందిరమునకు చుట్టు కట్టబడిన గోడతో కలిసియుండెను; ఇవి మందిరపుగోడను ఆనుకొనియున్న ట్టుండి ఆనుకొనక యుండెను. 7ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరముచుట్టునున్న యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను. 8మరియు నేను చూడగా మందిరము చుట్టునున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను, ఏలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్దమూరలుగల పునాది యుండెను. 9మేడగదులకు బయటనున్న గోడ అయిదు మూరల వెడల్పు; మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాలీగా విడువబడి యుండెను 10గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడి యుండెను 11మేడగదుల వాకిండ్లు ఖాలీగానున్న స్థలముతట్టు ఉండెను; ఒక వాకిలి ఉత్తరపుతట్టునను ఇంకొక వాకిలి దక్షిణపుతట్టునను ఉండెను. ఖాలీగా నున్న స్థలముచుట్టు అయిదు మూరల వెడల్పుండెను. 12ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటితట్టు డెబ్బది మూరల వెడల్పు, దాని గోడ అయిదు మూరల వెడల్పు; గోడ నిడివి తొంబది మూరలు. 13మందిరముయొక్క నిడివిని అతడు కొలు వగా నూరు మూరలాయెను, ప్రత్యేకింపబడిన స్థలమును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడలను కొలువగా నూరు మూరలాయెను. 14మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను. 15ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయెను. 16మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగుచేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్లకూర్పుండెను 17వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలతప్రకారము కట్టబడియుండెను. 18కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖము లుండెను. 19ఎట్లనగా ఈతట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్యముఖమును ఆతట్టు ఖర్జూరపుచెట్టువైపున సింహముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను. 20నేల మొదలుకొని వాకిలిపైవరకు మందిరపు గోడకు కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను. 21మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధములును అట్టివే. 22బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడినవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. 23మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను. 24ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది. 25మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను. 26మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 41: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.