యెహెజ్కేలు 4

4
1నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేముపట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. 2మరియు అది ముట్టడి వేయబడి నట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసి నట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. 3మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.
4మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆతట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. 5ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను. 6ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణ యించియున్నాను. 7ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను. 8పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. 9మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్లజిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనముచేయుచు రావలెను; 10నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను, 11నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగవలెను, వేళవేళకు త్రాగవలెను; 12యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్యమలముతో కాల్చి భుజింపవలెను; 13నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. 14అందుకు–అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటివరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా 15ఆయన–చూడుము, మనుష్యమలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించియున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకొనుమని సెలవిచ్చి 16–నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేనులేకుండ చేసినందునవారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు. 17అన్నపానములు లేకపోయినందునవారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 4: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 4 కోసం వీడియో