యెహెజ్కేలు 20:1-32

యెహెజ్కేలు 20:1-32 TELUBSI

ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవదినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణచేయుటకై నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము – ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయుము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని. అప్పుడు–నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని. అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నాకోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని. అయితే ఏ అన్యజనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించితిని. వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటిననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతిదినములను వారికి సూచనగా నేను నియమించితిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో యే అన్యజనులలోనుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా ఇచ్చెదనని నేను సెలవిచ్చినట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని. అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని. వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని–మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకునుమధ్యను సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నాకోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనులమధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచి, తమపితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశములలోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని. నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలముకాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని. తొలిచూలిని అగ్నిగుండముదాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీపితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి. మీరు పోవుచున్న ఉన్నతస్థలములేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటివరకు వాడుకలో నున్నది. కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీపితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే; నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు –అన్యజనులేమి భూమిమీది యేజనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతుమని మీరనుకొనుచున్నారే. మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు.

యెహెజ్కేలు 20:1-32 కోసం వీడియో