యెహెజ్కేలు 10
10
1నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలమువంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడెను. 2అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనినవానితో యెహోవా–కెరూబు క్రింద నున్న చక్రములమధ్యకు పోయి, కెరూబులమధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను. 3అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. 4యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను. 5దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను. 6–కెరూబులమధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను. 7కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను; 8అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవహస్తరూప మొకటి కనబడెను; 9నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. 10ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండియొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను. 11అవి జరుగుచుండగా నాలుగు వైపుల జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను. 12ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను. 13నేను వినుచుండగా–తిరుగు డని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను. 14కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖములుండెను; మొదటిది కెరూబుముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజుముఖము. 15ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. 16కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు. 17జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను 18యెహోవా మహిమ మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా 19కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితోకూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను. 20కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపెట్టితిని. 21ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్కలును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను. 22మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 10: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.