నిర్గమకాండము 9

9
1తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరోయొద్దకు వెళ్లి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. 2నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల 3ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱెలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. 4అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు మనెను. 5మరియు యెహోవా కాలము నిర్ణయించి–రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. 6మరునాడు యెహోవా ఆ కార్యముచేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెనుగాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు. 7ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావ లేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను.
8కాగా యెహోవా–మీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను. 9అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యులమీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను. 10కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను. 11ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను. 12అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను.
13తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–హెబ్రీ యులదేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచి–నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 14సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్లన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను; 15భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. 16నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. 17నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు. 18ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. 19కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగి నది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములోఉండు ప్రతిమనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. 20ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. 21అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.
22యెహోవా–నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తుదేశ మంతట పడునని మోషేతో చెప్పెను. 23మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను. 24ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు. 25ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను. 26అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. 27ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి–నేను ఈసారి పాపముచేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము; 28ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా 29మోషే అతని చూచి–నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. 30అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను. 31అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెనుగాని 32గోధుమలు మిరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. 33మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమిమీద కురియుట మానెను. 34అయితే ఫరో వర్షమును వడ గండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి. 35యెహోవా మోషేద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 9: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

నిర్గమకాండము 9 కోసం వీడియో