నిర్గమకాండము 35
35
1మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగు చేసి–మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధు లేవనగా 2ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవాకు విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్షనొందును. 3విశ్రాంతిదినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.
4మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లనెను–యెహోవా ఆజ్ఞాపించినదేమనగా 5–మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, 6నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు, 7-8ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ, ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు, 9ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను. 10మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను. 11అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు. 12మందసము దాని మోతకఱ్ఱలు, కరుణాపీఠము కప్పు తెర, 13బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు, 14వెలుగుకొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము 15ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళద్రవ్య సంభారము, మందిరద్వారమున ద్వారమునకు తెర. 16దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట 17ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర 18మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు 19పరిశుద్ధస్థలములో సేవచేయుటకు సేవావస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములునవియే అనెను.
20ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను. 21తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. 22స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళములను, సమస్తవిధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. 23మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. 24వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనోవాడు దాని తెచ్చెను. 25మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి. 26ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి. 27ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను 28సుగంధద్రవ్యమును, దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. 29మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.
30-33మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను– చూడుడి; యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. 34అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. 35చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపనిచేయువాడేమి నేతగా డేమిచేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమకాండము 35: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.